: ఎదురీదుతున్న టీమిండియా
కివీస్ పర్యటనలోనూ టీమిండియాను కష్టాలు వీడడంలేదు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 503 పరుగుల భారీస్కోరు చేయగా, భారత్ ఎదురీదుతోంది. రెండో రోజు ఆట చివరికి తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ఓపెనర్ ధావన్ డకౌట్ కాగా, ఎన్నో ఆశలు పెట్టుకున్న పుజారా 1 పరుగు చేసి నిరాశపరిచాడు. వీరిద్దరినీ కివీస్ యువ పేసర్ ట్రెంట్ బౌల్ట్ పెవిలియన్ చేర్చాడు. మరో ఓపెనర్ విజయ్ 26 పరుగులు చేసి వాగ్నర్ బౌలింగ్ లో వెనుదిరగగా, కోహ్లీని ఓ షార్ట్ పిచ్ బంతితో సౌథీ అవుట్ చేశాడు. దీంతో, 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియాను రోహిత్ శర్మ (67 బ్యాటింగ్), రహానే (23 బ్యాటింగ్) ఆదుకున్నారు. ఈ జోడీ ఐదో వికెట్ కు అజేయంగా 79 పరుగులు జోడించడంతో భారత్ కాస్త కోలుకుంది. కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ధోనీ సేన ఇంకా 373 పరుగులు వెనకబడి ఉంది.
అంతకుముందు, ఓవర్ నైట్ స్కోరు 329/4తో రెండో రోజు ఆట ఆరంభించిన ఆతిథ్య కివీస్ జట్టులో కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ (224) డబుల్ సెంచరీతో అలరించాడు. కోరే ఆండర్సన్ (77) కూడా సమయోచితంగా రాణించడంతో కివీస్ భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ 6 వికెట్లు, జహీర్ ఖాన్ 2 వికెట్లు తీశారు.