: 900 కేజీల రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబును నిర్వీర్యం చేసిన పోలీసులు
రెండవ ప్రపంచ యుద్ధం నాటి అతిపెద్ద బాంబును అతి కష్టం మీద హాంగ్ కాంగ్ పోలీసులు నిర్వీర్యం చేశారు. హాంగ్ కాంగ్ లోని హ్యాపీవ్యాలీ జిల్లాలో ఓ భవన నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా, రెండు వేల పౌండ్ల (ఇంచుమించు 900 కేజీలు) బరువు, రెండడుగుల వెడల్పు, ఐదడుగుల పొడవు కలిగిన 'యూఎస్ నేవి ఎఎన్ఎం 66' బాంబును భవన నిర్మాణ కార్మికులు గుర్తించారు. దీంతో హాంగ్ కాంగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ బృందం సుమారు 15 గంటల శ్రమించి బాంబును నిర్వీర్యం చేసింది. అయితే బాంబును అతి సున్నిత పదార్థాలతో తయారు చేశారని, అది పొరపాటున పేలి ఉంటే భారీ విధ్వంసమే జరిగి ఉండేదని పేర్కొన్నారు. దీంతో స్థానికులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.