: సోనీ ల్యాప్ టాప్ లు ఇక కనిపించవు!
ప్రపంచంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ, అత్యున్నత నాణ్యమైన ఉత్పత్తులకు మారుపేరైన జపాన్ కంపెనీ సోనీ ల్యాప్ టాప్ లు, నోట్ బుక్ లు సహా పర్సనల్ కంప్యూటర్ల వ్యాపారం నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. 'వయో' పేరుతో సోనీ వీటిని విక్రయిస్తోంది. టోక్యోకు చెందిన ఇన్వెస్ట్ మెంట్ ఫండ్, మరొక కంపెనీకి ఈ వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లు గురువారం సోనీ ప్రకటించింది. బదులుగా స్మార్ట్ ఫోన్ల వ్యాపారంలో దూసుకుపోవాలని సోనీ నిర్ణయించింది. వ్యాపారంలో నష్టాలు అంతకంతకు పెరిగిపోతుండడమే ఈ నిర్ణయం వెనుకనున్న కారణం. స్మార్ట్ ఫోన్ లు, టాబ్లెట్ పీసీలపై తాము ప్రధానంగా దృష్టి పెడతామని సోనీ పేర్కొంది. పర్సనల్ కంప్యూటర్ల రంగంలో తమకు వాటా చాలా తక్కువని.. అందుకే వాటి నుంచి వైదొలగుతున్నట్లు సోనీ సీఈఓ కజువో హిరాయ్ తెలిపారు. ఇతర వ్యాపారాలను సోనీ యథావిధిగానే కొనసాగించనుంది. కాకపోతే, టీవీలపై మరింత శ్రద్ధ పెట్టనుంది.
ఒకప్పుడు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు అంటేనే సోనీ అన్నంతగా ఆ కంపెనీ హవా నడిచింది. తర్వాతి కాలంలో శామ్ సంగ్, ఎల్జీ ఇతర కంపెనీలు మార్కెట్లో వేగంగా దూసుకుపోయాయి. అదే సమయంలో మొబైల్, కంప్యూటర్ల విభాగంలోనూ యాపిల్, ఇతర కంపెనీల నుంచి ఊహించని పోటీ ఎదురైంది. దీంతో సోనీ పోటీ పరంగా వాటి వెనుకే ఆగిపోయింది. చివరికి వ్యాపారాలను అమ్ముకోవాల్సిన దుస్థితికి చేరుకుంది. రానున్న కాలంలో ఈ కంపెనీ భవిష్యత్తు ఏమిటనేది వేసే అడుగులే నిర్దేశించనున్నాయి.