: భారత మార్కెట్లోకి మళ్ళీ అడుగుపెట్టిన మోటారోలా
తొలి తరం సెల్ ఫోన్ తయారీదారు మోటారోలా మళ్ళీ భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. స్మార్ట్ ఫోన్ లకు గిరాకీ పెరగడంతో తన కొత్త మోటో జి మోడల్ తో రెండేళ్ళ తర్వాత భారత్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 2012లో భారత్ లో తన ఉత్పత్తులను నిలిపివేసిన ఈ టెక్నో జెయింట్ మోటో జి మోడల్ స్మార్ట్ ఫోన్ పై గట్టి నమ్మకం పెట్టుకుంది. భారత యువతను ఈ ఫోన్ ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఈ ఫోన్ 8 జీబీ వెర్షన్ ధర రూ.12,490 కాగా, 16 జీబీ వెర్షన్ ధర 13,999గా నిర్ణయించారు.
4.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, 1.2 గిగాహెర్జ్ క్వాడ్-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 400 ప్రాసెసర్, ఆడ్రెనో 305 గ్రాఫిక్స్ కార్డు, 1 జీబీ ర్యామ్, డ్యూయల్ సిమ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. 5 ఎంపీ రియర్ కెమెరా, 1.3 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తున్న ఈ ఫోన్ లో రెండేళ్ళపాటు గూగుల్ డ్రైవ్ ద్వారా 50 జీబీ క్లౌైడ్ స్టోరేజ్ సదుపాయం పొందవచ్చు.