: నా తండ్రికి భారతరత్న వస్తుందన్న నమ్మకాన్ని కోల్పోయా: ధ్యాన్ చంద్ కుమారుడు
ప్రఖ్యాత హాకీ ఆటగాడు ధ్యాన్ చంద్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలంటూ దేశ ప్రజలందరూ ఎప్పటినుంచో విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ విజ్ఞప్తులు గతేడాది నుంచి మరింత ఉద్ధృతమయ్యాయి. అయినా, నిర్లక్ష్యం వహించిన కేంద్ర ప్రభుత్వం మరో ఇద్దరికి (సచిన్, సీఎన్ రావు) ప్రదానం చేసింది కూడా. దాంతో, దివంగత ధ్యాన్ చంద్ కుమారుడు అశోక్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తన తండ్రికి భారతరత్న వస్తుందన్న నమ్మకాన్ని కోల్పోయానన్నాడు.
కొన్ని రోజుల కిందట తండ్రి ధ్యాన్ చంద్ పేరును భారతరత్న పురస్కారానికి పరిశీలించాలంటూ క్రీడా మంత్రిత్వ శాఖకు అశోక్ ఓ అప్లికేషన్ పెట్టాడు. కానీ, నిన్న ఆ పురస్కారాలు మరొకరికి దక్కడంతో ఆ ఆశ కాస్తా పోయిందని ఓ ఆంగ్ల పత్రికతో ఫోన్ లో తన బాధను వ్యక్తం చేశాడు. ఆ పురస్కారాన్ని పొందే అర్హత ఉన్న మొదటి వ్యక్తి తన తండ్రేనన్నాడు. ప్రపంచ హాకీలో భారత్ పుంజుకోవడానికి తన తండ్రి ఎంతో తోడ్పడ్డాడని, దేశానికి కీర్తి, ప్రతిష్ఠలను తేవడంలో ఆయన కృషి ఉందని పేర్కొన్నాడు. 1928, 1932, 1936లో జరిగిన ఒలింపిక్స్ లో భారత్ కు బంగారు పతకాలు సాధించిపెట్టిన ఘనత ధాన్య్ చంద్ దే అని వివరించాడు.