: ముఖంలో పలికే భావాలు నాలుగేనట!
నటులు నవరసాలు పలికించగలిగితే గొప్ప కళాకారుల కిందే లెక్క. అద్భుతం, ఆవేశం, శృంగారం, హాస్యం, కరుణ, శాంతం, బీభత్సం, రౌద్రం, భయానకం.. ఇవీ మనం నవరసాలుగా పిలుచుకునే భావాలు. కానీ, శాస్త్రీయంగా అవి ఆరు అని ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు భావించేవారు. అయితే, ఇంగ్లండ్ లోని గ్లాస్గో యూనివర్శిటీ పరిశోధకులు సరికొత్త వాదనను తెరమీదికి తెచ్చారు. మనిషి ముఖంలో సాధారణంగా పలికే భావాలు నాలుగేనంటున్నారు. సంతోషం, దుఃఖం, భయం, కోపం.. ఇవే మానవుడు ముఖ కండరాలు వ్యక్తీకరించే భావాలని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ పాల్ ఎక్మాన్ అభిప్రాయపడ్డారు.
కొన్నికొన్ని భావాలు కలగలిసి పోయిన స్థితిలో ఉంటాయని వాటిని ప్రత్యేకంగా వర్గీకరించలేమని ఎక్మాన్ తెలిపారు. ఉదాహరణకు ఆశ్చర్యం, భయం వంటి భావాలు వ్యక్తీకరించే సమయంలో కళ్ళు విప్పారతాయట. ఇక కోపం, అసహ్యం వంటి భావాలు పలికే వేళ ముక్కు చిట్లిస్తారని గ్లాస్గో వర్శిటీ పరిశోధక బృందం వెల్లడిస్తోంది. మరి వీరి పరిశోధనలను సినీ దర్శకులు ఒప్పుకోరేమో. పలికించాల్సిన భావాలను పక్కాగా స్క్రిప్టులోనే రాసుకునే మన దర్శకులు అసలు ఏకీభవించకపోవచ్చు.