: 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలనను ప్రజలు ఇక చాలంటున్నారు: మోడీ
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కోల్ కతా సభకు ప్రజలు పోటెత్తారు. ఈ సభలో మోడీ మాట్లాడుతూ.. ఇంతటి జనసందోహాన్ని తాను తొలిసారి చూస్తున్నానని చెప్పారు. 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలనను ప్రజలు ఇక చాలనుకుంటున్నారని అన్నారు. మార్పు కోసం అప్పట్లో ఓటేస్తే.. నిజంగా మార్పు జరిగిందా? అని సభికులను ప్రశ్నించారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజలు వసతి, వైద్య సదుపాయాలు, తాగునీరు, విద్య, ఉపాధి కోరుకుంటున్నారని వివరించారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చే చిత్తశుద్ధి తమకుందని ఉద్ఘాటించారు.
ఇక, బెంగాలీలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు మోడీ. గుజరాత్, బెంగాల్ మధ్య ఎప్పటినుంచో అవినాభావ సంబంధం ఉందని తెలిపారు. చాలాకాలం రవీంద్రనాథ్ ఠాగూర్ గుజరాత్ లోనే ఉన్నారని వెల్లడించారు. గుజరాత్ లో జౌళి పరిశ్రమ ఎదుగుదలకు రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరుడి పాత్ర మరువలేమని గుర్తుచేసుకున్నారు. ప్రపంచంలో భారత్ ఉన్నతస్థానంలో ఉండాలని స్వామి వివేకానంద కోరుకున్నారని పేర్కొన్నారు. మొదటి నుంచి బెంగాల్ దేశానికి మార్గదర్శనం చేస్తూ ఉందని తెలిపారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే 60 ఏళ్ళలో సాధ్యం కాని అభివృద్ధిని చూపిస్తామని హామీ ఇచ్చారు.