: పీటర్సన్ కెరీర్ కు మంగళం పాడిన ఇంగ్లిష్ క్రికెట్ బోర్డు
సొగసైన బ్యాటింగ్ తో అలరించే అందగాడు కెవిన్ పీటర్సన్ కెరీర్ కు ఇంగ్లిష్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చరమగీతం పాడింది. ఇటీవల కాలంలో ఫామ్ కోల్పోయి పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతున్న ఈ దక్షిణాఫ్రికా జాతీయుణ్ణి తాజాగా వెస్టిండీస్ సిరీస్ తో పాటు బంగ్లాదేశ్ లో జరిగే టి20 వరల్డ్ కప్ టోర్నీకి ఎంపిక చేయకపోవడం ద్వారా ఈసీబీ తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. తద్వారా పీటర్సన్ తొమ్మిదేళ్ళ కెరీర్ కు తెరపడినట్టయింది. నేడు పీటర్సన్, ఈసీబీ అధికారులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఇంగ్లండ్ కు ఆడడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు. ఏదేమైనా కెరీర్ ను ఇలా ముగించాల్సి రావడం బాధాకరమని చెప్పుకొచ్చాడు. ఈ తొమ్మిదేళ్ళ కాలంలో జట్టుగా తాము సాధించిన విజయాల పట్ల గర్విస్తున్నాని తెలిపాడు. ఇటీవలే యాషెస్ సిరీస్ లో 0-5తో ఘోర పరాభవం నేపథ్యంలో ఫామ్ లో లేని పీటర్సన్ వంటి ఆటగాళ్ళపై ఈసీబీ వేటు వేసేందుకు ఉపక్రమించింది.
దక్షిణాఫ్రికా జాతీయుడైన కేపీ అక్కడ క్రీడల్లో జాతి వివక్షను నిరసిస్తూ ఇంగ్లండ్ కు వలసవచ్చాడు. కెరీర్ లో 104 టెస్టులాడిన ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ 47.28 సగటుతో 8181 పరుగులు చేశాడు. వాటిలో 23 సెంచరీలు, 35 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక 136 వన్డేల్లో 4440, 37 టీ20 మ్యాచ్ లలో 1156 పరుగులు సాధించాడు.