: సెహ్వాగ్-గంభీర్ జోడీ ఇక అంతేనా?


ఒకప్పుడు వాళ్ళు బరిలో దిగుతున్నారంటే ప్రత్యర్థులు హడలిపోయేవారు. బంతి బావురుమనేది. మైదానం నలుమూలలకూ పరిగెత్తడమే ఫీల్డర్లకు పరమావధిగా ఉండేది. వాళ్ళిద్దరి గురించి ఇంతకంటే పరిచయం అక్కర్లేదేమో..! ఈ ఉపమానాలన్నీ ఢిల్లీ బాబులు సెహ్వాగ్ ,గంభీర్ గురించే అని ఏ క్రికెట్ అభిమానిని అడిగినా ఠక్కున చెబుతారు.

ఈ కుడిఎడమల జోడీ.. ఇటీవలే టీమిండియా నుంచి దాదాపు మెడపట్టి గెంటివేసిన రీతిలో ఉద్వాసనకు గురైంది. పేలవ ఫామ్ తో పాటు కెప్టెన్ ధోనీతో విభేదాలు వీరిపై వేటుకు కారణమన్నది బహిరంగ రహస్యం. వీరి స్థానాల్లో జట్టులోకి వచ్చిన విజయ్, ధావన్ లు ఆసీస్ తో టెస్టు సిరీస్ లో విశేషంగా రాణించి తమ ఓపెనింగ్ స్థానాలను పదిలపరుచుకున్నారు.

పాపం, ఇప్పుడప్పుడే రిటైర్మెంటు ప్రకటించేది లేదని ఢంకా బజాయిస్తున్న సెహ్వాగ్ కు ధావన్ గట్టి పోటీదారుగా నిలుస్తున్నాడు. మొహాలీ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఈ ఢిల్లీ యువ కెరటం చేసిన 187 పరుగుల విధ్వంసక ప్రదర్శన..  వీరూ 'సెకండ్ ఇన్నింగ్స్' కి చెక్ పెట్టడం ఖాయం.. అని క్రికెట్ పండితుల ప్రగాఢ అభిప్రాయం.

ఇక గంభీర్ విషయానికొస్తే, గత కొన్నేళ్ళుగా పాత రికార్డుల ప్రాతిపదికనే జట్టులో నెట్టుకొచ్చిన ఈ ఎడమచేతివాటం ఆటగాడు, ఎట్టకేలకు బ్యాటింగ్ మూలాల అన్వేషణకు నడుం బిగించాడు. ఈ క్రమంలో నిన్న జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో ఢిల్లీ ఓపెనర్ గా బరిలోదిగి 54 బంతుల్లో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

పంజాబ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో సెహ్వాగ్ (36) కూడా రాణించడంతో ఢిల్లీ సునాయాసంగా నెగ్గింది. అయితే, ఇక ఈ ఢిల్లీ సీనియర్ జోడీ ఎంత రాణించినా భారత జట్టు గడప తొక్కడం అసాధ్యమన్నది సుస్పష్టం. ఎందుకంటే, విజయ్-ధావన్ జోడీ మధ్య సమన్వయం కుదరడంతోపాటు, జట్టు అవసరాల రీత్యా బ్యాటింగ్ చేయడంలో వీరిద్దరూ ఎంతో పరిణతి ఉన్నవాళ్ళలా వ్యవహరించడం అందర్నీ ఆకట్టుకుంది.

మరి, కొత్తనీరు వస్తే పాతనీరు పోదా..! సెహ్వాగ్-గంభీర్ పరిస్థితీ అంతే. గత ఏడాదిగా టీమిండియాలో ఉన్నన్నాళ్ళూ నిమ్మకునీరెత్తినట్టు ఉండి.. తీరా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. దేశవాళీ టోర్నీలో బ్యాట్లు ఝుళిపిస్తున్నారు. ఏదేమైనా వెరీవెరీ లేట్ గురూ..!.

  • Loading...

More Telugu News