: హైదరాబాద్ లో పుట్టాడు.. అమెరికాలో మెరిశాడు... సత్య నాదెళ్ళ ప్రస్థానం
హైదరాబాద్ లో మనందరి మధ్యే సాధారణ వ్యక్తిలా తిరిగాడు సత్య నాదెళ్ల. నేడు టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టాడు. సమస్త తెలుగుజాతికి గర్వకారణంగా నిలిచిన ఆయన గురించి కొన్ని వ్యక్తిగత వివరాలు తెలుసుకుందాం. నాదెళ్ల సత్యన్నారాయణ చౌదరి (నాదెళ్ల సత్య) హైదరాబాద్ లో పుట్టి పెరిగారు. ఆయన స్వస్థలం మాత్రం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం గ్రామం. ప్రస్తుతం గ్రామంలో వారికి పదెకరాల పొలం కూడా ఉంది. సత్య వాళ్ల నాన్న యుగంధర్ ఒకప్పుడు ఐఏఎస్ అధికారి. దాంతో సత్య హైదరాబాద్ లో 1967లో జన్మించారు. విద్యాభ్యాసం కూడా బీటెక్ వరకు అక్కడే నడిచింది. మణిపాల్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. విస్కాన్సిన్ వర్సిటీ నుంచి ఎంఎస్, షికాగో నుంచి ఎంబీయే పూర్తి చేశారు. కొంత కాలం సన్ మైక్రో సిస్ట్సమ్స్ లో పనిచేసిన అనంతరం 1992లో మైక్రోసాఫ్ట్ లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 2012-13 సంవత్సరంలో ఆయన తీసుకున్న వేతనం 76లక్షల డాలర్లు. భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఆయనకు ఉన్నారు. సత్య చివరిసారిగా బీటెక్ చదివేటప్పుడు తండ్రితో కలిసి స్వగ్రామానికి వెళ్లి వచ్చారు. ఇప్పుడు బుక్కాపురం గ్రామ ప్రజల్లో సంతోషం పొంగి పొర్లుతోంది.