: వెంకయ్యనాయుడి ఆగ్రహం.. రాజ్యసభలో గందరగోళం, వాయిదా
వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. డిప్యుటీ ఛైర్ పర్సన్ పై బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభాపతి పోడియం వద్ద సీమాంధ్ర నేతలు నినాదాలతో హోరెత్తించారు. సరిగ్గా అదను చూసిన కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మతహింస నిరోధక బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో బీజేపీ నేతలకు ఎక్కడ లేని ఆగ్రహం ముంచుకొచ్చింది.
సభ ఆర్డర్ లో లేకుండా బిల్లును ఎలా ప్రవేశపెడతారని డిప్యుటీ ఛైర్ పర్సన్ కురియన్ ను ప్రశ్నించారు. ముందు సభను అదుపులోకి తీసుకొచ్చి ఆ తరువాత బిల్లులు ప్రవేశపెట్టండి అని సూచించారు. సభా మర్యాదలు పాటించకుండా బిల్లును ఎలా తీసుకొస్తారని, బిల్లు గురించి సభ్యులకు పరిచయం చేయరా? అంటూ నిలదీశారు. అనంతరం సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.