: నేడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి ధర్నా


కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ దేశరాజకీయాల్లో తొలిసారిగా సొంతపార్టీకి చెందిన ముఖ్యమంత్రే ఢిల్లీలో ధర్నాకు దిగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కేంద్రప్రభుత్వ తీరుకు నిరసనగా, ఆయన ఈ రోజు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు. తొలుత ఇందిరాగాంధీ సమాధి శక్తిస్థల్ వద్ద ధర్నా చేయాలని ముఖ్యమంత్రి భావించినా, అక్కడ మరమ్మత్తులు జరుగుతుండటంతో ధర్నా కార్యక్రమాన్ని జంతర్ మంతర్ కు మార్చారు. దీనిలో భాగంగా ఉదయం 9 గంటలకు సీఎం, ఇతర సీమాంధ్ర నేతలు రాజ్ ఘాట్ కు వెళ్లి జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులతో కలసి 11 గంటల నుంచి జంతర్ మంతర్ వద్ద ధర్నాలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల వరకూ ఈ ధర్నా కొనసాగుతుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు సీమాంధ్ర నేతలతో కలసి ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తారు. రాష్ట్ర అసెంబ్లీ విభజన బిల్లును తిరస్కరించిన నేపథ్యంలో, బిల్లును పార్లమెంటుకు పంపవద్దని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా రాష్ట్రపతిని కోరనున్నారు.

  • Loading...

More Telugu News