: కేన్సర్ వ్యాధి తరుముకొస్తోంది.. బీ కేర్ ఫుల్


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్ల మీద ఎలాంటి మాస్కులు, హెల్మెట్ కూడా పెట్టుకోకుండా ఒక్క గంట సేపు తిరిగితే చాలు.. ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి నెలకొంది. జంటనగరాల్లో పెరుగుతోన్న వాహన కాలుష్యంతో కనీసం స్వచ్ఛమైన గాలి కూడా కరవైంది. ఇక్కడి గాలిలో ఒక క్యూబిక్ మీటరుకు 60 మైక్రో గ్రాముల వరకు పర్టిక్యులేట్ మేటర్ (పీఎం) ఉండవచ్చని కాలుష్య నియంత్రణ మండలి లెక్కలు వెల్లడిస్తున్నాయి. అది ఇప్పుడు 95 మైక్రో గ్రాములకు చేరింది.

జంటనగర వాసులు ఆందోళన, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనానికి వారి ఆహారపు అలవాట్లు అంటే జంక్ ఫుడ్ తినడంతో పాటు ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్ల వల్ల కూడా కేన్సర్ వస్తుందని వైద్య నిఫుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో, మామూలు ఆస్తమా నుంచి ఊపిరితిత్తుల కేన్సర్, గుండెపోటుతో సహా అనేక రకాల జబ్బులు వచ్చే ప్రమాదముంది. ఇక, ఆటోలు, బస్సులు, ఇతర వాహనాల నుంచి వెలువడుతోన్న పొగలో ఉండే కాలుష్య కారకాలతో పలు రకాల కేన్సర్లు వస్తాయని వైద్య నిఫుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా కనపడుతోంది. లంగ్ కేన్సర్ రావడానికి ఇదే ప్రధాన కారణమని పల్మనాలజిస్టులు పేర్కొన్నారు.

ఇవాళ (ఫిబ్రవరి 4)న ప్రపంచ కేన్సర్ దినం. ఆధునిక జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు.. వంటి పలు కారణాలతో కేన్సర్ వేగంగా వ్యాపిస్తోంది. యువకుల నుంచి వయోవృద్ధుల వరకు ఈ కేన్సర్ బారిన పడుతున్నారు. ఈ వ్యాధి బారిన పడుతున్న కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో పాటు, మానసికంగా కూడా క్షోభను అనుభవిస్తున్నాయి. చాలా రకాల కేన్సర్లు మూడు, నాలుగో దశలలో బయటపడుతుండటంతో.. అప్పటికే వ్యాధి ఎక్కువై చికిత్స చేయించుకున్నా ఒక్కోసారి ప్రయోజనం ఉండటం లేదు.

రోజూవారీ జీవితంలో చలాకీలా ఉండేవాళ్లను కూడా కేన్సర్ కబళిస్తోంది. ఈ కేన్సర్ వ్యాప్తి చెందటానికి ఒక రకంగా బహుళజాతి సంస్థలు కూడా కారణమవుతున్నాయి. ఆహార పంటలపై విరివిగా పురుగు మందులు, రసాయనాలను వాడుతున్నారు. ఆహారంతో పాటు అవి నేరుగా శరీరంలోకి వెళ్లి కేన్సర్ కు కారణమవుతున్నాయని అంటున్నారు. అందుకే ఇటీవల కాలంలో ఆర్గానిక్స్ ఉత్పత్తుల వైపు నగరవాసులు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి, కేన్సర్ వ్యాధితో అవగాహన పెంపొందించుకొని, వ్యాధి రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  • Loading...

More Telugu News