: ‘ఆధార్’ ఉత్తర్వులను గాలికొదిలేసిన గ్యాస్ కంపెనీలు
గ్యాస్ సిలిండర్లు ఆరు ఇస్తామని, కాదు కాదు తొమ్మిది సరిపోతాయని చెప్పిన కేంద్ర ప్రభుత్వం తాజాగా సబ్సిడీపై ఇచ్చే వంట గ్యాస్ సిలిండర్లను 12కు పెంచుతున్నామని ప్రకటించింది. అలాగే ‘ఆధార్’తో గ్యాస్ కనెక్షన్లకు ముడిపెట్టొద్దని ఇటీవల న్యాయస్థానాలు ఆదేశాలు ఇచ్చాయి. గ్యాస్ సిలిండర్ కు ఆధార్ కార్డు లింకేజీ అవసరం లేదని జనవరి 30వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. అయితే ఆచరణ లో మాత్రం వినియోగదారులను అయోమయానికి గురిచేసే విధంగా వ్యవహరిస్తోంది. గ్యాస్ కంపెనీలు మాత్రం ఆధార్ కార్డు, బ్యాంకు ఎకౌంట్ ఉంటేనే సిలిండర్ సరఫరా చేస్తామని చెబుతున్నారు. తమకు ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని వారు చెబుతున్నారు.
గత సంవత్సర కాలంగా గ్యాస్ వినియోగదారులకు ఆధార్ లింకు సమస్య ఉన్నప్పటికీ సుమారు రెండు నెలలుగా గ్యాస్ కంపెనీలు మరింత ఒత్తిడి పెంచాయి. దీంతో వినియోగదారులు ఆయా గ్యాస్ ఏజెన్సీల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంట గ్యాస్ కోసం ఆధార్ అవసరం లేదని ప్రకటించిన ప్రభుత్వం, పక్కాగా అమలు చేయకపోవడంతో జిల్లాలోని గ్యాస్ వినియోగదారులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.