: బాసర పుణ్యక్షేత్రంలో వైభవోపేతంగా వసంత పంచమి వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా బాసరలో కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఏటా మాఘ శుద్ధ పంచమి (వసంత పంచమి)ని అమ్మవారి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. వసంత పంచమి సందర్భంగా మంగళవారం వేకువ జాము నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. బాసర సరస్వతీ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.
చదువుల తల్లి సరస్వతీ అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయిస్తే తమ చిన్నారులు విద్యావంతులు అవుతారని భక్తుల నమ్మకం. ఈ క్రమంలోనే ఇవాళ వందలాది మంది చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు జరిగాయి. మూడు రోజుల పాటు జరిగే వసంత పంచమి వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. తొలి రోజున అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి అక్షరాభ్యాస పూజలను ప్రారంభించారు. ఉత్సవం సందర్భంగా తెల్లవారుజామున రెండు గంటలకు మంగళ వాయిద్య సేవ, సుప్రభాత సేవలతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. రెండున్నర గంటలకు అమ్మవారికి మహాభిషేకం, అలంకరణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అక్షరాభ్యాస, కుంకుమార్చన పూజలు వైభవోపేతంగా జరిగాయి.