: మహిళలకు అక్షయ్ కుమార్ ఆత్మరక్షణ పాఠాలు
సినిమాల్లోకి రాకముందు నటుడు అక్షయ్ కుమార్ పక్కా ప్రొఫెషనల్ మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడన్న విషయం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ కు వచ్చాక విజయవంతంగా సినీ జీవితాన్ని సాగిస్తున్న అక్షయ్ మళ్లీ అటువైపు చూసేందుకు సమయం దొరకలేదు. దాంతో, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ మార్షల్ అర్ట్స్ కు సంబంధించి మహిళలకు పాఠాలు చెప్పబోతున్నాడు. ఈ క్రమంలో మే లో ముంబయిలో ఓ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ సంస్థను ప్రారంభించబోతున్నాడు. 'యువసేన' చీఫ్ ఆదిత్య థాకరే తో కలసి ఈ సంస్థను నెలకొల్పబోతున్నాడు.
మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు భిన్నంగా వీరిద్దరూ ప్రారంభిస్తున్న ఈ సంస్థ ఉండబోతుంది. ఇందులో అన్ని వయసుల మహిళలకు ఆత్మరక్షణ తరగతులు నిర్వహిస్తారు. తమను తాము రక్షించుకునేందుకు కొన్ని టెక్నిక్ లను వివరిస్తారు. మూడు నెలల పాటు ఉండే ఈ శిక్షణ ఆసక్తిగల వారికి పూర్తి ఉచితంగా ఉంటుంది. అయితే, సంస్థ ఏర్పాటు విషయాన్ని అక్షయ్, ఆదిత్య థాకరే కూడా ధృవీకరించారు.