: గ్రేటర్ హైదరాబాదులో తుస్సుమన్న.. పైప్ లైన్ గ్యాస్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన పైప్ లైన్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) ప్రాజెక్టు.. చివరకు తుస్సుమంది. పీఎన్జీ ద్వారా నేరుగా వంటింటికే సరఫరా చేయాలన్న లక్ష్యంతో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్) ప్రారంభించిన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు పనులు ఏడాది కాలంగా ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. 2014 ఏప్రిల్ నాటికి హైదరాబాదు నగరంలో లక్ష కుటుంబాలకు పీఎన్జీ అందించాలని బీజీఎల్ తొలి దశలో లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికీ కేవలం 440 కుటుంబాలకే పైప్ లైన్ గ్యాస్ అందుతోంది. పైప్ లైన్ పనుల విస్తరణ 32 కిలోమీటర్లు దాటకపోగా, పీఎన్జీ వినియోగదారులకు కూడా గ్యాస్ సరఫరా అవసరానికి తగట్టుగా అందటం లేదు.
గ్రేటర్ హైదరాబాదులో రంగారెడ్డి జిల్లా శామీర్ పేటలో బీజీఎల్ పీఎన్జీ మదర్ స్టేషన్ ను 2011, నవంబరు 21వ తేదీన ప్రారంభించి.. ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. శామీర్ పేట సమీపంలో నల్సార్ వర్శిటీ క్యాంపస్ లోని 30 ఫ్లాట్స్ లకు, మేడ్చల్ మండలంలో 310 కుటుంబాలకూ పీఎన్జీ కలెక్షన్లను ఇచ్చి గ్యాస్ సరఫరా చేస్తోంది. తర్వాత మరికొన్ని నివాస ప్రాంతాలకు పీఎన్జీ ఏర్పాటు చేసినా ఇంకా సరఫరా ప్రారంభించలేదు. ఈ దశలో, పైప్ లైన్ గ్యాస్ కావాలని నగర వాసుల నుంచి డిమాండ్ వస్తోంది. మరో వైపు కొంపల్లి, సుచిత్ర, జీడిమెట్ల, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాలకు పైప్ లైన్ నిర్మాణ పనులను విస్తరించాలని బీజేఎల్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాంతాలకు సంబంధించి, పైప్ లైన్ గ్యాస్ పనులపై ఏప్రిల్ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని బీజీఎల్ అధికారులు తెలిపారు. దీంతో, నగరంలోని మిగతా ప్రాంతాలకు పీఎన్జీ కావాలంటే నగరవాసులు మరో ఆరు నెలలు ఆగాల్సిందే.