: అనూహ్య హత్య కేసులో నాకు సంబంధంలేదు: స్నేహితుడు హేమంత్
అత్యంత అనుమానాస్పదంగా మారిన మచిలీపట్నంకు చెందిన సాప్ట్ వేర్ ఇంజనీర్ అనూహ్య ఎస్తేర్ హత్య కేసులో అసలు నిందితులెవరనేది ఇంకా తేలలేదు. రెండు రోజుల కిందట హేమంత్ అనే యువకుడిని ముంబై పోలీసులు అనుమానించారు. అయితే, తనకు మాత్రం అనూహ్య హత్య కేసులో ఎలాంటి సంబంధంలేదని చెప్పాడు. ఆమె తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని అన్నాడు. ఈ మేరకు ఓ తెలుగు వార్తా ఛానల్ తో మాట్లాడిన అతడు పైవిధంగా చెప్పాడు.
అనూహ్య రైలులో ముంబైకి వెళుతున్నప్పుడు సికింద్రాబాదు రైల్వే స్టేషన్ కు వచ్చాక ఆమెకు లంచ్ బాక్స్ ఇచ్చానని, తర్వాత తాను షిరిడీకి వెళ్లానని తెలిపాడు. ఆ రోజు మధ్యాహ్నం ఒకసారే తనకు ఫోన్ చేసిందన్నాడు. అయితే, తను అనూహ్య వెళ్లిన రైలులోనే మరో బోగీలో వెళ్లినట్లు చెబుతున్నారని, అది వాస్తవం కాదన్నాడు. తాను తర్వాత షిరిడీ వెళ్లానని, కావాలంటే అక్కడ గుడికి వెళ్లి సీసీటీవీ పుటేజ్ చూసుకోవచ్చని వివరించాడు. అసలు తనను ఎందుకు అనుమానిస్తున్నారో అర్థం కావడం లేదని హేమంత్ అన్నాడు.