: రాజీవ్ హంతకుల పిటిషన్లపై నేడు సుప్రీం విచారణ
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ముద్దాయిలు దాఖలు చేసుకున్న పిటిషన్లపై సుప్రీం కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. అప్పట్లో రాజీవ్ హత్య కేసులో శాంతన్, మురుగన్, పెరారివలన్ లకు మరణశిక్ష విధించారు. ఈ ముగ్గురు రాష్ట్రపతికి క్షమాభిక్ష నివేదనలు పంపుకున్నారు. 2011లో వారి క్షమాభిక్ష అభ్యర్థనలను అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తిరస్కరించారు. అయితే, తమ క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో తీవ్రమైన జాప్యం జరిగిందని, అందుకే, తమ మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలని వారు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఓ సభలో పాల్గొనేందుకు వచ్చిన రాజీవ్ ను మానవబాంబు సాయంతో తమిళటైగర్లు హత్య చేసిన సంగతి తెలిసిందే.
1998లో టాడా కోర్టు ఈ కేసులో 26 మందికి మరణశిక్ష విధించింది. అయితే, తదనంతరం సుప్రీం నలుగురికి మాత్రమే మరణ శిక్షను ఖరారు చేసింది. వారిలో నళినికి మినహాయింపునిచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి, రాజీవ్ సతీమణి సోనియా గాంధీ సూచన మేరకు 2000లో నళిని మరణశిక్షను జీవితఖైదుగా మార్చారు. ఇక మిగిలిన ముగ్గురిని సెప్టెంబర్ 9, 2011న ఉరి తీయాల్సి ఉండగా, మద్రాస్ హైకోర్టు స్టే ఇవ్వడంతో అది నిలిచిపోయింది.