: ఫేస్ బుక్ పదేళ్ల ప్రస్థానం.. మరో పదేళ్ల తర్వాత ఉంటుందా?


ప్రపంచంలో ప్రతీ ఆరుగురిలో ఒకరు ఫేస్ బుక్ కుటుంబంలో సభ్యులు. ప్రపంచవ్యాప్తంగా 123 కోట్ల మంది ఫేస్ బుక్ ను ఉపయోగిస్తున్నారు. 2004లో ఓ చిన్న సైట్ గా ప్రారంభమై.. ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోయింది. పదేళ్లు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఫేస్ బుక్ విశేషాలు కొన్ని..

2004 ఫిబ్రవరి ఇదే రోజున ఫేస్ బుక్ ను హార్వర్డ్ యూనివర్సిటీలో మార్క్ జుకెర్ బర్గ్ కొందరు స్నేహితులతో కలిసి ప్రారంభించాడు. విద్యార్థుల మధ్య సమాచార వారధి కోసం ఉపయోగపడాలన్నది ఆయన ఆకాంక్ష. మంచి స్పందన వచ్చింది. దాంతో ఇతర వర్సిటీలు, కాలేజీ విద్యార్థులకూ ఫేస్ బుక్ ను పరిచయం చేశాడు. 2004 సెప్టెంబర్ లో యూజర్లు తమ వ్యక్తిగత వివరాలు పోస్ట్ చేసేందుకు వీలుగా వాల్ అందుబాటులోకి వచ్చింది.

ఫేస్ బుక్ కు వ్యతిరేకంగా 2004లో కోర్టులో కేసు దాఖలైంది. ఫేస్ బుక్ ఐడియాను తమ నుంచి కాపీ కొట్టారంటూ కొందరు కోర్టుకెళ్లారు. తర్వాత దీన్ని కంపెనీ పరిష్కరించుకుంది. 2006 సెప్టెంబర్ లో 13 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ ఫేస్ బుక్ లో చేరేందుకు అనుమతించారు. న్యూస్ ఫీడ్ కూడా అందుబాటులోకి వచ్చింది. 2007 మేలో ఫొటోలు షేర్ చేసుకునే అవకాశం, గేమ్స్ ఆడుకునే సౌకర్యాలు అమల్లోకి వచ్చాయి. 2008 ఏప్రిల్ లో చాట్ ప్రారంభమైంది. లైక్స్ కొట్టే సౌకర్యం 2009 ఫిబ్రవరిలో అమల్లోకి వచ్చింది.

పదేళ్లలో ఊహించని ప్రస్థానాన్ని ఫేస్ బుక్ చేరుకుంది. కానీ, 2018 నాటికి ఫేస్ బుక్ పతనావస్థకు చేరుకుంటుందని.. చాలా మంది దాన్ని విడిచిపెడతారని ఇటీవలే ఒక సంస్థ సర్వే చేసి చెప్పింది. మరోవైపు రోజురోజుకూ కొత్త కొత్త సోషల్ నెట్ వర్క్ సైట్లు, మొబైల్ అప్లికేషన్లు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సవాళ్లను జుకెర్ బర్గ్ ఏ విధంగా అధిగమిస్తారో.. మరో పదేళ్ల తర్వాత ఫేస్ బుక్ ను ఏ తీరాలకు చేరుస్తారో..? కాలమే సమాధానం చెబుతుంది.

  • Loading...

More Telugu News