: నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్న రైల్వే యూనియన్లు
యూపీఏ ప్రభుత్వానికి మరో తలపోటు తప్పేట్టులేదు. రైల్వే యూనియన్లు వచ్చే నెలలో నిరవధిక సమ్మెకు దిగాలని నిర్ణయించాయి. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధానంగా నూతన పెన్షన్ స్కీమ్, కాంట్రాక్టు నియామకాల నిలుపుదల, ఔట్ సోర్సింగ్ సేవలకు స్వస్తి చెప్పడం వంటి అంశాలపై రైల్వే యూనియన్లు గత కొంతకాలంగా పోరాడుతున్నాయి. దేశంలో అతిపెద్ద రైల్వే యూనియన్లు ఆలిండియా రైల్వే ఫెడరేషన్ (ఏఐఆర్ఎఫ్), నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మెన్ (ఎన్ఎఫ్ఐఆర్) ఈ నెల 12 సమావేశమై సమ్మె కార్యాచరణపై చర్చించనున్నాయి.
సమ్మె కార్యరూపం దాల్చితే 1974 తర్వాత దేశంలో రైల్వే ఉద్యోగులు చేపట్టే అతిపెద్ద సమ్మె అవుతుంది. అప్పట్లో జార్జి ఫెర్నాండెజ్ నేతృత్వంలో రైల్వే సంఘాలు సమ్మె చేయగా ఇందిరాగాంధీ ప్రభుత్వం దాన్ని ఉక్కుపాదంతో అణచి వేసింది. తత్ఫలితంగా ఎందరో సిబ్బంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది.