: తప్పుదోవ పట్టిస్తే మూల్యం చెల్లించాల్సిందే!


ఫలానా కొబ్బరి నూనె వాడితే కురులు నిగనిగలాడతాయనో.. తమ సబ్బు రుద్దుకుంటే పట్టులాంటి చర్మం సొంతమవుతుందనో ప్రకటనలు గుప్పించే కంపెనీలకు, ఆ వాణిజ్య ప్రకటనల్లో నటించే సెలబ్రిటీలకు ఈ వార్త కాస్త చేదుగా ఉండొచ్చు! ఇకమీదట ప్రకటనలతో వినియోగదారులను తప్పుదోవ పట్టించే సంస్థలపై కొరడా ఝుళిపించేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. ప్రకటనల్లో చెప్పిన విధంగా సదరు ఉత్పత్తి పనితీరు కనబర్చకపోతే వినియోగదారుడు ఫిర్యాదు చేయవచ్చు. తద్వారా ఆ ప్రకటన సొంతదారుతో పాటు అందులో నటించిన సెలబ్రిటీలు సైతం జరిమానాకు గురవుతారు. అంటే, ఆ యాడ్ కు కంపెనీతోపాటు సెలబ్రిటీలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

నిన్న ఢిల్లీలో కేంద్ర ఆహార శాఖ మంత్రి కేవీ థామస్ అధ్యక్షతన సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సమావేశం కాగా, ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని సాధ్యాసాధ్యాలపై ఓ సబ్ కమిటీ వేయాలని నిర్ణయించారు. ఆహార, కేశ తైలాలు, ఆరోగ్య పరిరక్షణ ఉత్పత్తులు వినియోగదారులపై మిక్కిలి ప్రభావం చూపుతాయని, అందుకే వాటికి సంబంధించిన వాణిజ్య ప్రకటనలపై దృష్టి సారిస్తామని ఓ అధికారి తెలిపారు.

  • Loading...

More Telugu News