: ముందు మీ సీఎంను ఒప్పించి, ఆ తరువాత మాట్లాడండి: నిర్మలా సీతారామన్
తెలంగాణ అంశంపై తప్పించుకునేందుకు కాంగ్రెస్ నేతలు భారతీయ జనతాపార్టీ (బీజేపీ)ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ తమ పార్టీకి చెందిన ముఖ్యమంత్రినే ఒప్పించలేకపోయిందని ఎద్దేవా చేశారు. ముందు తమ పార్టీ నేతలను ఒప్పించి, ఆ తరువాతే బీజేపీ వైపు వేలెత్తి చూపాలని ఆమె కాంగ్రెస్ అధిష్ఠానానికి సూచించారు. బీజేపీ మొదటి నుంచి ఒకే మాటమీద ఉందని, బీజేపీకి స్పష్టమైన వైఖరి ఉందని ఆమె వెల్లడించారు. రెండు ప్రాంతాల నేతలను ఒకే వేదికపై కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించలేకపోయిన కాంగ్రెస్ పార్టీ చెబితే నేర్చుకునే స్థితిలో బీజేపీ లేదని ఆమె స్పష్టం చేశారు.