: వెంకన్న భక్తులకు ఇక నాణ్యమైన లడ్డూ ప్రసాదం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అందించే లడ్డూ ప్రసాదంలో నాణ్యతకు ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ కనుమూరి బాపిరాజు చెప్పారు. అలాగే భక్తుల ప్రయోజనార్థం తిరుమలలో బహుళ అంతస్తుల పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయించామని ఆయన వెల్లడించారు. రెండు బ్లాకులుగా నిర్మించ తలపెట్టిన ఈ పార్కింగ్ కాంప్లెక్స్ కోసం 50 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. ఒక్కో బ్లాక్ లో 750 కార్లు పార్కింగ్ చేసేందుకు అనువుగా ఈ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. ప్రతిరోజు 300 బస్సులు, నాలుగు వేల కార్లు, 2500 మోటారు సైకిళ్లు తిరుమలకు రాకపోకలు సాగిస్తున్నాయని గుర్తించారు.
తిరుమల నాలుగు మాడ వీధుల్లో శ్రీవారి విహారానికి (ఊరేగింపు) 33 కిలోల బంగారంతో కూడిన సహస్రనామ లక్ష్మీహారాన్ని తయారుచేయిస్తున్నామని, దీనిని రెండు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు బాపిరాజు తెలిపారు. కనుమూరి సమీప బంధువు రామలింగరాజు ఈ హారాన్ని శ్రీవారికి కానుకగా సమర్పిస్తున్నారు. దీని విలువ 11 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ హారాన్ని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి ఇవ్వనున్నారు. ఈ ఆభరణాన్ని తయారు చేయించే బాధ్యతను టీటీడీ జ్యువెలరీ విభాగానికి అప్పగించారు. తిరుచానూరులో 5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అన్నప్రసాదం కాంప్లెక్స్ నిర్మాణానికి కూడా టీటీడీ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.