: ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెట్టింది: మోడీ
పేదల కడుపు నిండాలంటే కమలం వికసించాలని, బీజేపీ అధికారంలోకి రావాలని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల పరిస్థితి దుర్భరంగా మారిందని ఆరోపించారు. పదేళ్ల కాలంలో గుజరాత్ లో అల్లర్లు లేకుండా నివారించామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్ లో కూడా అల్లర్లు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు ఆయన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో భారీ బహిరంగసభలో ప్రసంగించారు. దేశ భవిష్యత్తును నిర్ణయించేది 2014 ఎన్నికలే అని... ఈ ఎన్నికల్లో అవినీతి కాంగ్రెస్ ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సమాజ్ వాది పార్టీ విరోధి పార్టీలా మారిందని విమర్శించారు. యూపీలో గూండా రాజ్యం నడుస్తోందని అన్నారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టడం కాంగ్రెస్ అలవాటని... తెలంగాణ అంశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలను రెండుగా చీల్చిందని తెలిపారు. ఎన్డీఏ హయాంలో ఎలాంటి సమస్యలు లేకుండా మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు.