: నివేదికను రేపు ఢిల్లీకి విమానంలో తీసుకెళ్లనున్న ప్రత్యేక బృందం
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై, శాసనసభలో జరిగిన చర్చకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం రేపు కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. సాధారణ పరిపాలన శాఖ, శాసనసభలోని 60మంది అనుభవజ్ఞులైన అధికారులు చర్చలకు సంబంధించిన క్రోడీకరణలో పాల్గొంటున్నారు. సభ్యుల ప్రసంగాలను ఆంగ్లంలోకి అనువదిస్తున్నారు. ఎలాంటి లోపాలు , దోషాలు లేకుండా రూపొందిస్తున్న ఈ నివేదిక శాసనసభ కార్యదర్శి సదారాం పర్యవేక్షణలో జరుగుతోంది. నివేదికపై జరుగుతున్న తుది కసరత్తు ఈ రోజు మధ్యాహ్నానికి పూర్తవుతుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఈ ప్రతులన్నింటిని పరిశీలిస్తున్నారు. నివేదిక రహస్యమైనందున, దీన్ని కేంద్ర హోంశాఖ కు స్వయంగా అందజేసేందుకు ముగ్గురు అధికారుల బృందాన్ని విమానంలో ఢిల్లీకి పంపించాలని సీఎస్ నిర్ణయించారు. దీంతో రేపు ఉదయం 9.45 గంటలకు హైదరాబాదు నుంచి ఢిల్లీ బయలుదేరే ఎయిర్ ఇండియా విమానంలో నివేదికను పంపిస్తున్నారు. నివేదికతో పాటు మరో 50 ముద్రణ కాపీలు, వాటి సీడీలను కూడా విమానంలో పంపిస్తున్నారు. మొత్తం 600 కిలోల మేరకు ఉన్న వీటిని తీసుకెళ్లడానికి మరికొంతమంది నాలుగోతరగతి సిబ్బందిని కూడా పంపిస్తున్నారు.