: రాష్ట్రపతి రబ్బరు స్టాంపా?.. రాష్ట్రపతి అధికారాలు మీరే తీసుకుంటారా? : పయ్యావుల ఫైర్


ఆ ముగ్గురు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా?.. లేక తెలంగాణ వాదులా? అంటూ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ యూపీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, అభిషేక్ సింఘ్వీతో పాటు దిగ్విజయ్ సింగ్ కు రాష్ట్రపతి అంటే గౌరవం లేదా? అని నిలదీశారు. బిల్లును పార్లమెంటుకు పంపాల్సింది రాష్ట్రపతా? లేక వీరా? అని అడిగారు. లేకపోతే ఈ ముగ్గురి దృష్టిలో రాష్ట్రపతి రబ్బరు స్టాంపా? అని కడిగేశారు.

ప్రణబ్ ముఖర్జీ ప్రతిష్ఠకే సవాలుగా ఈ ముగ్గురి వ్యాఖ్యలు ఉన్నాయన్న పయ్యావుల, రాష్ట్రపతి కార్యాలయం అంటే పోస్టాఫీస్ అనుకుంటున్నారా? అంటూ మండిపడ్డారు. రాష్ట్ర విభజన వారు ముగ్గురూ చెప్పిన డేట్ల ప్రకారం జరిగితే రాష్ట్రపతిని రబ్బరు స్టాంపుగా భావించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. జరుగుతున్న పరిణామాలు, కేంద్రం నుంచి చేస్తున్న వ్యాఖ్యలు పూర్తి వివరాలతో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాస్తామని పయ్యావుల తెలిపారు.

కేంద్రంలో అధికారంలో ఉన్నామని గర్వంతో, కేంద్ర ప్రభుత్వం అధికారం పేరుతో, ఆర్టికల్ 3 పేరుతో సీమాంధ్ర ప్రజలపై జరుగుతున్నది ముమ్మాటికీ అత్యాచారమేనని ఆయన అభిప్రాయపడ్డారు. భారత రాష్ట్రపతిని, కేంద్ర మంత్రులను సీమాంధ్ర ప్రజలకు హక్కులు లేవా? అని ప్రశ్నిస్తున్నామన్నారు. సీమాంధ్రులు ఈ దేశంలోని మనుషులు కారా? అని నిలదీశారు. దేశంలో భాగమైతే, మరి మా హక్కులను కాలరాసే హక్కు ఎవరు మీకిచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీలో స్పీకర్ ప్రసంగంపై ఎవరికి వారు భాష్యాలు చెబుతున్నారని, ఇప్పటికైనా స్పీకర్ గారు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పయ్యావుల సూచించారు. రాష్ట్రపతి పంపిన బిల్లుపై చర్చ ముగిసిందని, తీర్మానం పెడుతున్నాం అని రెండు ముక్కలు చేసి చెప్పలేదని స్పష్టం చేశారు. బిల్లుపై చర్చను ముగించాల్సిన అవసరం ఉంది కనుక రాష్ట్రపతి పంపిన బిల్లును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మూజువాణి ఓటుతో తిరస్కరిస్తుందని చదివారని ఆయన తెలిపారు. రాష్ట్రపతి భవన్ ను ఆ ముగ్గురూ గాంధీభవన్, లేక 10 జనపథ్ కొనసాగింపు అనుకుంటున్నట్టున్నారని మండిపడ్డారు.

అటార్నీ జనరల్ తెలంగాణ ముసాయిదా బిల్లును వ్యతిరేకించారని తెలిపారు. షిండే, దిగ్విజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. అసెంబ్లీలో తమ పనిని దిగ్విజయంగా పూర్తి చేశామని, మిగిలింది కేంద్ర మంత్రులు, ఎంపీల భాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. బిల్లును అడ్డుకోలేని పక్షంలో కేంద్ర మంత్రులను జాతి ద్రోహులుగా పేర్కొంటూ శిలాఫలకాలు వేస్తామని హెచ్చరించారు. వారే కాకుండా వారి భావి తరాలు కూడా రాజకీయాల్లో లేకుండా చేస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News