: ఆ 3333 మంది ఉద్యోగులకు జనవరి జీతాలందలేదు
సమగ్ర ఆర్థిక యాజమాన్య వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో వ్యక్తిగత సమాచారమివ్వని కారణంగా విశాఖ జిల్లాలోని 3333 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు నిలిచిపోయాయి. సీఎఫ్ఎంఎస్ కింద ఉద్యోగులు తమ వ్యక్తిగత సమాచారం, కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. వివరాలు ఇవ్వని వారికి జీతాలు నిలిపివేయాలని కూడా ఖజానా శాఖకు సూచించింది. దీంతో జిల్లాలోని దాదాపు 90 శాతం వరకు ఉద్యోగులు తమ వ్యక్తిగత వివరాలను అధికారులకు సమర్పించారు. మిగిలిన 10 శాతం వరకు ఇంకా వివరాలను ఇవ్వలేదు.
జనవరి 27వ తేదీకి గడువు ముగిసినప్పటికీ ఇంకా వేలాది మంది ఉద్యోగులు వివరాలు ఇవ్వకపోవడంతో తుది గడువును 31వ తేదీ వరకు పొడిగించారు. దీంతో ఇప్పటివరకు 90 శాతం వరకు (30,052 మంది) ఉద్యోగులు తమ వివరాలను అందించారు. మరో 3,333 మంది ఉద్యోగులు ఇంకా వివరాలు సమర్పించలేదు. ప్రధానంగా యలమంచిలి, పాయకరావుపేట సబ్ ట్రెజరీ ఆఫీసుల పరిధిలో ఎక్కువ మంది వివరాలు ఇవ్వాల్సి ఉందని జిల్లా ఖజానా శాఖాధికారులు గుర్తించారు. వీరందరికి ఇవాళ (1వ తేదీ) రావాల్సిన జీతాలు నిలిపివేశారు.