: ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర.. తరలివచ్చిన గిరిపుత్రులు
వరంగల్ జిల్లాలోని సమక్క, సారలమ్మ జాతర తర్వాత.. రెండవ అతి పెద్ద గిరిజన జాతర నాగోబా జాతర. రాష్ట్ర ప్రభుత్వం నాగోబా జాతరను అధికారిక ఉత్సవంగా ప్రకటించింది. గురువారం రాత్రి ఆదిలాబాదు జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్ లో జాతర ప్రారంభమైంది. సమీకృత గిరిజనాభివృద్ధి అథారిటి (ఐటిడిఎ) పీవో జనార్ధన్ గిరిజన అర్చకులతో కలసి దేవాలయంలో పూజల్లో పాల్గొన్నారు. ఈ నెల మూడో తేదీన దర్భార్ జరుగుతుందని ఆయన చెప్పారు.
జాతరకు 15 రోజుల ముందు గిరిజన అర్చకులు 70 కి.మీ.ల దూరాన వున్న గోదావరి నదికి కాలినడకన వెళ్లి, నాగోబా స్వామిని అభిషేకించడానికి అక్కడి నదీ జలాలను తీసుకువస్తారు. ఆదిలాబాదు జిల్లాలోని ఉట్నూరు, నర్నూరు, జైనూరు, ఇంద్రవెల్లి, తలమడుగు, బేల మండలాల నుంచి గిరిజనులు పెద్ద ఎత్తున నాగోబా దేవాలయానికి తరలి వస్తారు. మన రాష్ట్రము నుంచే కాక మహారాష్ట్ర నుంచి గోండులు, కొలంలు లాంటి గిరిజన తెగలు కూడా జాతరలో పాల్గొంటాయి.