: మారువేషంలో సంచరించిన రజనీకాంత్!
మన పాత జానపద సినిమాలు గుర్తున్నాయా?
తన పరిపాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారనే దానిని తెలుసుకునేందుకు రాజు ముఖ్య అనుచరులతో మారువేషాల్లో తిరుగుతుంటాడు. అలాంటిదే సూపర్ స్టార్ రజనీకాంత్ జీవితంలో చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా కోట్లలో అభిమానులను కలిగిన రజనీకాంత్ తాను సూపర్ స్టార్ కాకముందు అనుభవాలను మరోసారి అనుభవంలోకి తెచ్చుకోవాలనుకున్నారు. దీనికి ఆయన స్టార్ డమ్ పెద్ద అడ్డంకిగా మారింది. తన కారణంగా ప్రజలు ఇబ్బంది పడకూడదనుకున్న రజనీకాంత్ మారువేషం వేశారు.
కర్ణాటకలోని బెంగళూరులో గత ఐదు రోజులుగా ఆయన మిత్రులతో గత స్మృతులను నెమరవేసుకుంటూ నగరం మొత్తం కలియతిరిగారు. తాను చిన్నప్పుడు ఇష్టంగా తిన్న తిళ్లన్నీ తింటూ, తన స్నేహితులతో తిరిగిన ప్రదేశాలలో సంచరిస్తూ ఉల్లాసంగా గడిపారు. రేస్ కోర్సు రోడ్డులో ఆయన మిత్రుడు ఉంటున్న అపార్ట్ మెంట్ లో విడిది చేశారు.
విషయాన్ని ఎలాగోలా పసిగట్టిన అభిమానులు ఆ ఇంటి వద్ద గుమిగూడి జై రజనీకాంత్..జైజై రజనీకాంత్ అంటూ నినాదాలు చేశారు. దీంతో రజనీ తమ ప్రాంతంలోనే ఉన్నారా? అంటూ చుట్టుపక్కల వారు బిత్తరపోయారు. వారు కూడా అభిమానులతో కలిసిపోయారు. దీంతో రజనీకాంత్ బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. ఆయనతో ఫోటోలు దిగేందుకు వారు పోటీలు పడ్డారు.
చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అదుపు చేయాల్సి వచ్చింది. బెంగళూరులో రజనీకీ చాలా మంది ప్రాణస్నేహితులు ఉన్నారు. బెంగళూరు వచ్చిన ప్రతిసారీ ఆయన మారు వేషాల్లో తిరుగుతుంటారు!