: హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సలహాదారు


కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సలహాదారు విజయ్ కుమార్ ఈ రోజు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ శాఖల్లో భద్రత అంశాల పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. ఈ రోజు, రేపు ఆయన రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. గ్రేహౌండ్స్, హైదరాబాద్ నగర శాంతిభద్రతలు, పోలీసు బలగాల పెంపు తదితర అంశాలపై డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ శాంతిభద్రతలను గవర్నర్ కు అప్పగించవద్దని ఇరు ప్రాంతాలకు చెందిన పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ సమస్య పరిష్కార చర్యలపై కూడా చర్చించనున్నట్టు సమాచారం.

రాష్ట్ర విభజన నేపథ్యంలో విజయ్ కుమార్ గతంలో కూడా శాంతిభద్రతలు, పోలీసుల పంపిణీపై మాజీ డీజీపీలతో భేటీ నిర్వహించి కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించడంతో బిల్లులో పొందుపరచాల్సిన అంశాలపై పూర్తి సమాచారం కోసమే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News