: దిగ్విజయ్ చేప్పేది ఏదీ జరగదు: లగడపాటి
సీఎం కిరణ్ ఇవాళ సిక్సర్ కొట్టారని... ఇంకా బ్యాటింగ్ కొనసాగిస్తూనే ఉన్నారని ఎంపీ లగడపాటి చెప్పారు. బిల్లును సీమాంధ్ర నేతలు, ప్రజలు ఎందుకు వ్యతిరేకించారో కేంద్రం గుర్తించాలని సూచించారు. ఐదేళ్ల ఉద్యమ కాలంలో లక్షలాది ఉద్యోగాలు కోల్పోయామని అన్నారు. ఫిబ్రవరి 21 పార్లమెంటుకు చివరి రోజని... ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. మనది నియంతల దేశం కాదని, ప్రజాస్వామ్య దేశమని... మరో మూడు వారాల్లో ఈ విషయం నిరూపితమవుతుందని అన్నారు. స్పీకర్ వ్యవహారశైలిపై కొందరి వ్యాఖ్యలు విచారకరమని చెప్పారు. తెలుగు జాతి ఉనికి కోల్పోవడాన్ని తాము ఒప్పుకోమని తెలిపారు. విభజనవాదులు తమ స్వార్థాల కోసమే విభజన కోరుకుంటున్నారని చెప్పారు. పార్లమెంటులో టీబిల్లు పాస్ అవుతుందన్న దిగ్విజయ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... ఆయన చెప్పేది ఏదీ జరగదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీతో పనిలేనప్పుడు బిల్లును ఇక్కడకు పంపడమెందుకని ప్రశ్నించారు.