: జగన్ సమైక్య ముసుగు వేసుకున్న విభజనవాది: రఘురామ కృష్ణంరాజు
వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ అయిన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త రఘురామ కృష్ణంరాజు పార్టీపై, జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఓ చానల్ తో మాట్లాడిన ఆయన, తానే పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు. వైఎస్సార్సీపీ విభజన కోరుకుంటోందని, అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. జగన్ సమైక్య ముసుగు వేసుకున్న విభజనవాది అని దుయ్యబట్టారు.
రాష్ట్రం ఎప్పుడు విడిపోతుందా? అని ఎదురు చూస్తున్నారని, విడిపోతే తప్ప తాను ముఖ్యమంత్రిని కాలేననే జగన్ విభజనకు సహకరిస్తున్నారని ఆరోపించారు. కాబట్టి, తనతో మైండ్ గేమ్ ఆడవద్దని హెచ్చరించిన కృష్ణంరాజు... తాను నోరు విప్పితే వారి జాతకాలు మొత్తం బయటపడతాయన్నారు. స్వార్థపూరిత రాజకీయాలను ప్రజలు ఏమాత్రం క్షమించరన్న ఆయన నియోజకవర్గ కార్యకర్తలతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.