: తెలంగాణ వారిని చూసి నేర్చుకోండి: కన్నీటితో నన్నపనేని విజ్ఞప్తి
తెలుగుదేశం ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కంటతడి పెట్టుకున్నారు. విభజన బిల్లు చర్చించేందుకు అవసరమైన సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాదులో తీవ్ర వేదనతో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రం విడిపోవాల్సిన పరిస్థితులు దాపురించినా పదవులకు అతుక్కుపోయారంటూ సీమాంధ్ర కేంద్ర మంత్రులపై దుమ్మెత్తిపోశారు. కనీసం తెలంగాణ నేతలను చూసైనా సిగ్గు తెచ్చుకోవాలని సూచించారు. తెలంగాణ నేతలు వారి వాదనలు నెగ్గించుకునేందుకు పార్టీలకతీతంగా ఏకతాటిపై నిలబడ్డారని, సీమాంధ్ర కేంద్ర మంత్రులు మాత్రం తమ పదవులు కాపాడుకునేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద సాష్టాంగప్రణామాలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.