: సభ తిరస్కరించినా.. బిల్లుపై ముందుకెళ్లే అవకాశాలు కేంద్రం చేతిలో
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్ర శాసనసభ తిరస్కరించడంతో.. ఏం జరుగుతుందా? అంటూ యావత్ తెలుగు ప్రజానీకం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. శాసనసభ తిరస్కరించింది కనుక కేంద్రం ఇక ఈ విషయంలో దూకుడుగా వెళ్లే అవకాశాలు లేనే లేవని సీమాంధ్ర నేతలు అభిప్రాయపడుతుండగా.. సభ అభిప్రాయంతో పని లేకుండా కేంద్రం విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతుందని తెలంగాణ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి కర్తవ్య్తం ఏంటన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ చేపట్టింది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ అభిప్రాయాలతో సంబంధం లేకుండా ముందుకెళ్లే సర్వాధికారాలు కేంద్రానికి ఉంటాయి. ఎన్డీయే ప్రభుత్వం బీహార్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ సమయంలో అనుసరించిన తీరు ఈ సందర్భంగా గమనార్హం. అప్పుడు బీహార్ అసెంబ్లీ కూడా విభజన బిల్లును తిరస్కరించి పంపింది. అయినా కేంద్ర ప్రభుత్వం ఆ తరువాత దాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అలాగే, ఇప్పుడు తెలంగాణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ముందుకు తీసుకెళ్లి ఆమోదం పొందుతుందా, లేదా? అనేది వేచి చూడాల్సి ఉంది.
కేంద్ర ప్రభుత్వం శాసనసభ అభిప్రాయాలనే కోరిందిగానీ, సభామోదం కాదన్న విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. అయితే, ఈ బిల్లు విషయంలో రాష్ట్రపతి ప్రణబ్ వ్యవహార శైలి ముఖ్యపాత్ర పోషించనుంది. శాసనసభ తిప్పి పంపిన బిల్లును రాష్ట్రపతి కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. సభ తిరస్కరించినందున దానిపై పునరాలోచన చేయాలని, లేదా మరేదైనా ప్రణబ్ సూచిస్తారేమో చూడాలి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం న్యాయ నిపుణుల అభిప్రాయాలను తీసుకోవాలని భావిస్తే కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ విషయంలో రాష్ట్రపతిదే కీలక పాత్ర. దీనిపై వచ్చే రెండు మూడు రోజుల్లో కీలక పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.