: రాష్ట్రాల విభజనకు విధానం కావాలి.. మేం సూచించిన పరిష్కారమే భేష్: జేపీ
రాష్ట్రాల విభజనకు ఓ ప్రత్యేక ప్రాతిపదిక కావాలని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, చెన్నైతో కూడిన ఉత్తర తమిళనాడు, బెంగళూరుతో కూడిన దక్షిణ కర్ణాటక, ముంబైతో కూడిన మహారాష్ట్ర విడిపోతామని డిమాండ్ చేస్తూ విడిపోతే, ఆయా రాష్ట్రాల్లో మిగిలిన ప్రాంతాల పరిస్థితేంటని ఆయన స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తాము పరిష్కారాలు సూచించామని ఆయన తెలిపారు. రాయలసీమ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, దాని కారణంగా ఆ ప్రాంతానికి ప్రతేక ప్రతిపత్తి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
రాయలసీమకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ పన్ను రాయతీలు, ప్రత్యేక పధకాలు చేపడితే ప్రయోజనం ఉంటుందని విభజన సులభమవుతుందని ఆయన సూచించారు. లేని పక్షంలో విభజన పెద్ద డిబేట్ గా మిగిలిపోతుందని జేపీ స్పష్టం చేశారు. కేంద్రానికి నచ్చినట్టు ప్రవర్తిస్తే అరాచకం రాజ్యమేలుతుందని ఆయన తెలిపారు.
కేంద్రం ఒడిశాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి, దాని కనుగుణంగా పన్నుల రాయితీ ఇచ్చిందని, అందువల్లే అక్కడ వెనుకబాటుతనాన్ని కాస్తయినా నిర్మూలించగలిగారని ఆయన తెలిపారు. నిజాయతీ, చిత్తశుద్ధితో రాష్ట్రాల ఏర్పాటు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు కార్యరూపం దాల్చదని ఆయన వివరించారు.