: సీఎం, స్పీకర్ కుమ్మక్కయ్యారు... పార్లమెంటులో సత్తా చూపుతాం: కేటీఆర్
స్పీకర్, సీఎం కుమ్మక్కై దొడ్డి దారిన దొంగల్లా తీర్మానం ప్రతిపాదించి ఆమోదింపజేసుకున్నారని టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, శాసనసభలో జరిగిందంతా ఒక ప్రహసనం మాత్రమేనని, దీని వల్ల ఒరిగేది ఏదీ లేదని అన్నారు. ముఖ్యమంత్రికి ఫిబ్రవరిలో రాజకీయ సన్యాసం తప్పదని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్, సీఎం సొంత పార్టీ అధిష్ఠానాన్ని ధిక్కరించి బిల్లును తిరస్కరించారని మండిపడ్డారు. శాసనసభ పాత్ర రాష్ట్ర ఏర్పాటులో నామమాత్రమేనని, దీనిని ప్రజలెవరూ పట్టించుకోవద్దని ఆయన సూచించారు.
శాసనసభ నిర్ణయంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు ఢిల్లీకి మోసుకెళ్తామని కేటీఆర్ తెలిపారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు? అన్నది పార్లమెంటులో తేలుతుందని అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన తీర్మానం నాలుక గీసుకునేందుకు కూడా పనికి రాదని కేటీఆర్ తెలిపారు. శాసనసభలో జరిగింది ఏమీ లేదని పార్లమెంటులో సత్తా చూపుతామని కేటీఆర్ చెప్పారు.