: ప్రయోగాల బాట పట్టి.. ‘24 క్యారెట్ల’ను పండించిన కడప రైతు
‘24 క్యారెట్ల’ను ఆ రైతు పండించాడు. అవును, బంగారం లాంటి పంటను పండించి.. ఇప్పుడు మంచి దిగుబడిని సాధించి తోటి రైతులతో శెభాష్ అనిపించుకున్నాడు. క్యారెట్ సాగుకు శ్రీకారం చుట్టి ప్రయోగాల బాట పట్టిన కృష్ణయ్యపై ఇప్పుడు అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వ్యవసాయ అధికారుల సలహాలతో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పండించి, సేంద్రీయ ఎరువులతో క్యారెట్ సాగు చేసిన ముద్దనూరుకు చెందిన రైతు కృష్ణయ్య కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది.
కృష్ణయ్య తనకున్న రెండెకరాల పొలంలో ఒక ఎకరంలో చీనీ చెట్లు, మరో ఎకరంలో బొప్పాయి సాగు చేశారు. నిమ్మలో వంగ, బొప్పాయిలో క్యారెట్ ను అంతర పంటగా సాగు చేశారు. సాదారణంగా కడప జిల్లా వాతావరణానికి క్యారెట్ పంట సాగు చేయడం కష్టం. అయినా, ధైర్యంగా ఇరవై సెంట్లలో క్యారెట్ సాగు చేశారు. కేవలం 3,500 పెట్టుబడితో ఒకటిన్నర టన్ను క్యారెట్ దిగుబడి సాధించారు. మార్కెట్ లో కిలో క్యారెట్ 15 రూపాయల చొప్పున విక్రయించగా, ఖర్చులన్నీ పోను 25 వేల రూపాయల వరకు ఆదాయం వచ్చింది. ప్రస్తుతం క్యాబేజి, క్యాలీఫ్లవర్, బఠానీలు, బంగాళదుంపల సాగు చేపట్టాలనే ఆలోచనల్లో ఉన్నానని కృష్ణయ్య తెలిపాడు.
బొప్పాయిలో క్యారెట్‌ను అంతర పంటగా సాగు చేసి మంచి దిగుబడి తీశాడని, ఇలాంటి ప్రయోగాలు చేసేవారు ముందుకు వస్తే ఎంతటి టెక్నాలజీనైనా అందించడానికి సిద్ధంగా ఉన్నామని ముద్దనూరు ఉద్యాన అధికారి ప్రసాదరెడ్డి చెప్పారు.