: రైల్వేలో ఎమర్జన్సీ కోటా (ఈక్యూ) ఎత్తివేత
అత్యవసర పరిస్థితుల్లో, రైల్వే రిజర్వేషన్ దొరకని సందర్భంలో ఉపయోగించుకునే ఎమర్జన్సీ కోటా (ఈక్యూ) పద్ధతిని రైల్వే శాఖ రద్దు చేసింది. ఇందులో భాగంగా ముందుగా తిరుపతి నుంచి నడిచే రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లకు 'ఈక్యూ' పధ్ధతి రద్దు చేస్తూ, దక్షిణ మధ్య రైల్వే ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలి కాలంలో ఈ పద్ధతిలో బెర్తుల కోసం పలువురు పెద్దల నుంచి విపరీతమైన ఒత్తిడి వస్తోందనీ, రోజుకి సుమారు నాలుగు వందల సిఫార్సు లేఖలు అందుతున్నాయనీ రైల్వే శాఖ ఉన్నత వర్గాలు చెబుతున్నాయి.
దీంతో లేనిపోని ఇబ్బందులు ఎదురవుతుండడంతో, మొత్తం ఈ పద్ధతినే ఎత్తి వేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. తిరుపతి-హజరత్ నిజాముద్దీన్ మధ్య నడుస్తున్న ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ కు ఈ నెల 15 నుంచి, తిరుపతి-ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణా ఎక్స్ ప్రెస్ కు మార్చి ఒకటి నుంచి 'ఈక్యూ' పద్ధతిని రద్దు చేశారు.