: గాంధీ వారసత్వ రాజకీయాలతో దేశానికి ఒరిగిందేమిటి?: వెంకయ్య నాయుడు
విజయవాడ స్వరాజ్ మైదానంలో భారతీయ జనతాపార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో ‘మోడీ ఫర్ పీఎం’ ప్రచార సభ జరిగింది. ఈ సభలో బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్య నాయుడు పాల్గొని ప్రసంగించారు. దేశంలో గాంధీ వారసత్వ రాజకీయాలతో దేశానికి ఒరిగిందేమిటని ఆయన ప్రశ్నించారు. ఆనాడు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పరిపాలించాలని, ఇప్పుడు సోనియా గాంధీ నాయకత్వంలో యూపీఏ పాలన సాగిస్తున్నారని ఆయన చెప్పారు. అవకాశం వస్తే ప్రధాని కావడానికి రాహుల్ గాంధీ రెడీగా ఉన్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో మనం ఓటర్లు.. కాంగ్రెస్ వాళ్లు లూటర్లుగా మారారని ఆయన చెప్పారు. బీజేపీది ‘లోటస్‘ అయితే.. కాంగ్రెస్ పార్టీది ‘లూటర్స్’ అని ఆయన అన్నారు.
గ్యాస్ సిలిండర్లను ఢిల్లీలో ‘అమ్మ‘ తగ్గిస్తే.. ఇప్పుడేమో ‘అబ్బాయి‘ సిలిండర్లను పెంచుతానంటున్నాడని ఆయన చెప్పారు. మహిళ అధ్యక్షురాలిగా ఉన్న పార్టీ ప్రభుత్వం మహిళా బిల్లుపై ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ కుహనా లౌకికవాద రాజకీయాలు ఇక చెల్లవని ఆయన తేల్చి చెప్పారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గిరిజన, మైనారిటీ వర్గాలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.