: 3డి ప్రింటర్ తో లౌడ్ స్పీకర్ సృష్టి...ఎంచక్కా ఇంట్లోనే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్!
ఓ మంచి కెమేరా, అత్యాధునిక మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ వంటివి మీరు ప్రింట్ తీసుకుంటే, అవి వెంటనే వస్తురూపంలోకి మారిపోయే సౌలభ్యం మన ప్రింటర్లో ఉంటే భలే ఉంటుంది కదూ? సరిగ్గా ఇలాంటి సాంకేతిక అద్భుతాన్ని ఓ ఎన్నారై విద్యార్థి సాధించి చూపించాడు. అమెరికాలో ఉంటున్న ఎన్నారై విద్యార్థి అపూర్వ కిరణ్ సారధ్యంలోని శాస్త్రవేత్తల బృందం... 3డి ప్రింటర్ లోంచి 'లౌడ్ స్పీకర్లు' ప్రింట్ చేసింది.
ఇందులో ప్లాస్టిక్, కండక్టివ్, అయస్కాంత విడి భాగాలున్నాయి. కాగా ఇది మామూలు లౌడ్ స్పీకర్ లాగే పని చేస్తుంది. కేవలం విడిభాగాలను ప్రింట్ తీసి కలపడం కాకుండా, ఏకంగా పూర్తి స్థాయి లౌడ్ స్పీకర్ లను 3డి ప్రింటర్ లోంచి బయటకు తీసే పద్దతిని వీరు కనుగొన్నారు. ఈ 3డి స్పీకర్ పని చేసేందుకు యాంప్లిఫైర్ కు కలిపారు. అది అద్భుతంగా పని చేస్తోంది. ఇందులో ఒబామా ప్రసంగం కూడా వినిపించారు.
అయితే, ఇందులో అయస్కాంత సమన్వయం కోసం శ్రీవాత్సవ అనే కెమికల్, బయోమాలిక్యులర్ విద్యార్థి సాయం తీసుకున్న అపూర్వ కిరణ్, రాబర్ట్ మెక్ కర్డీ ఇద్దరూ కార్నెల్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు. మెకానికల్, ఏరో స్పేస్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రోఫెసర్ హాడ్ లిప్పన్ వీరికి సలహాలు సూచనలు అందిస్తూ మార్గదర్శకం వహించారు. ఇలాంటి సాంకేతిక సామర్థ్యం అందుబాటులోకి వస్తే ఇక ఎలక్ట్రానిక్ సామాన్లన్నీ మనకు కావలసిన రీతిలో తయారు చేసుకోవచ్చు!