: బిచ్చగాళ్ల ఖాతాలు.. లక్షల్లో లావాదేవీలు.. నయా దందా!
సైబర్ నేరాలు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నైజీరియన్ల ముఠాల ఆగడాలు పోలీసుల మెదళ్లకు మేత పెడుతున్నాయి. ఈ మధ్య చోటు చేసుకున్న సంఘటన వైట్ కాలర్ నేరగాళ్ల తీరును బయట పెడుతోంది. ఓ సైబర్ క్రైం దర్యాప్తులో భాగంగా లక్షల్లో లావాదేవీలు ఓ ఖాతా నుంచి జరిగినట్టు పోలీసులు గుర్తించారు. దాంతో ఆ ఖాతాదారును వెతుక్కుంటూ బీహార్ వెళ్లారు. కేసు కొలిక్కి వచ్చేసిందని ఊపిరి పీల్చుకున్నారు. వారూహించినట్టే ఖాతాదారు కూడా దొరికాడు. అంతే, అవాక్కవ్వడం పోలీసుల వంతైంది. ఒక్క నిమిషం షాక్ కొట్టినట్టైంది.
ఆ ఖాతాదారు బిక్షగాడు. వాడికి బ్యాంక్ అకౌంట్ ఉందన్న విషయం కూడా తెలియదు. కానీ వాడి ఖాతా ద్వారా లక్షల లావాదేవీలు జరిగాయి. అదీ విషయం. దీంతో పోలీసులు ఈ విషయాన్ని లోతుగా అధ్యయనం చేశారు. దీంతో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. +92తో ప్రారంభమయ్యే నెంబర్లనుంచి లాటరీ తగిలిందంటూ ఫోన్లు, ఎస్ఎంఎస్ లు వస్తుంటాయి.
వాటి బుట్టలో పడి ఆయా నెంబర్లకు కాల్ చేస్తే ఉన్నవీ లేనివి చెప్పి ఒక్క క్షణంలోనే ఊహల్లో కోటీశ్వరుల్ని చేసేస్తారు. దీంతో మైకంలో పడ్డ మనుషుల్ని ట్యాక్స్ లు కట్టాలి, డబ్బులు ఫలానా అకౌంట్లో జమచేయండి అంటూ కొంత మొత్తం లాగడానికి ప్రయత్నిస్తారు. లాటరీ అనగానే బాధితుడు కనీసం పక్కవాడికి కూడా చెప్పడు. వాడే వారు చెప్పిన అకౌంట్ లో జమచేసి మోసపోయాక పోలీసుల్ని ఆశ్రయిస్తారు.
దీనిని ఆసరా చేసుకున్న నైజీరియన్లు బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఆధార్ గుర్తింపు ఉన్న బిక్షగాళ్లను, నిరుద్యోగులను నైజీరియన్ సైబర్ క్రైం మోసగాళ్లు గుర్తించి ఆధార్, ఫోటోలు ఇస్తే 2500 రూపాయలు ఇస్తామంటూ ఎర చూపి వారి పేరిట బ్యాంకు అకౌంట్లు తెరిచి మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు.