: వాస్తవాలకు సమాధి... అసలు అత్యాచారమే జరగలేదట...ఎంత విచిత్రం!


పశ్చిమ బెంగాల్ లో బీర్భూమ్ జిల్లాలో వివిధ జిల్లాలకు చెందిన గిరిజన గ్రామ పెద్దలు వాస్తవాలకు సమాధి కడుతున్నారు. న్యాయం కళ్లకు గంతలు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పదుగురాడు మాట పాడియై ధరజెల్లు అన్న వేమన పద్యాన్ని చదువుకుని బాగానే వంట బట్టించుకున్నారు. బీర్భూమ్ జిల్లాలో ప్రేమించిన పాపానికి, 20 ఏళ్ల యువతిపై 13 మంది కీచకుల్ని ఎగదోసిన గ్రామపెద్దలు, కొత్త వాదన వినిపిస్తున్నారు. అసలక్కడ అత్యాచారమే జరగలేదని అంటున్నారు.

కొన్ని తరాలుగా వస్తున్న తమ సంప్రదాయ అంతర్గత న్యాయ వ్యవస్థను మీడియా భ్రష్టు పట్టించాలని కుట్రపన్నిందని ఆరోపిస్తున్నారు. దీనిపై వివిధ జిల్లాలకు చెందిన 20 సంతల్ సంస్థలు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. అన్నీ కలిపి అసలు అక్కడ అత్యాచారమే జరగలేదని తేల్చిచెప్పాలని నిర్ణయించాయి. దీని ప్రకారమే బాధితురాలిగా చెబుతున్న మహిళను వేరే కులానికి చెందిన వ్యక్తితో ఉండగా బయటకు లాక్కొచ్చిన సంగతి వాస్తవమే కానీ, అత్యాచారం జరగలేదని, రాజీ కుదుర్చుకున్నామని చెబుతున్నారు.

కేవలం తమ అంతర్గత న్యాయవ్యవస్థను తప్పుపట్టేందుకే మీడియా ఇలాంటి ఆరోపణలు చేస్తోందని అక్కడి వాళ్లు మండిపడుతున్నారు. అయితే, బాధితురాలిపై అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్ధారించారు. దారుణమైన లైంగిక దాడి కారణంగా ఆమె జననాంగాలు ఛిద్రమైపోయాయని నివేదిక అందజేశారు. ఆసుపత్రిలో ఆమె భౌతికంగా కోలుకుంటోంది తప్ప, మానసికంగా తీవ్రంగా గాయపడిందని మానసిక వైద్యులు చెబుతున్నారు. మరో వైపు అక్కడి పెద్దలు విధించిన 25 వేల రూపాయల జరిమానా చెల్లించిన ప్రేమికుడి కుటుంబం ఆ గ్రామం నుంచి నిష్క్రమించింది.

జరిగిన దారుణాన్ని సభ్యసమాజం మొత్తం ఖండించింది. న్యాయస్థానం కూడా పూర్తి నివేదిక అందజేయాలంటూ అధికారులను ఆదేశించింది. వారు వెంటనే గ్రామస్థుల వాంగ్మూలాలు తీసుకున్నారు. అయినప్పటికీ అక్కడి స్థానిక గిరిజన కులపెద్దలు తమ మాటమార్చి నమ్మించాలని చూడడం దౌర్భాగ్యం!

  • Loading...

More Telugu News