: సమైక్యవాదుల్ని గెలిపించండి..ఢిల్లీకి సమాధానం చెప్పండి: అశోక్ బాబు
రాజ్యసభకు బరిలో నిలుచున్న అభ్యర్థుల్లో సమైక్యవాదుల్ని గెలిపించి ఢిల్లీలో ఉన్న అధిష్ఠానానికి సరైన సమాధానం చెప్పాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, బిల్లుపై తీర్మానం చేయడమా? లేక వెనక్కి పంపడమా? అనేది తేల్చాలని డిమాండ్ చేశారు. సమైక్యవాదాన్ని బలపరుస్తున్న అభ్యర్థులనే రాజ్యసభకు పంపించాలని ఆయన కోరారు. బిల్లును పార్లమెంటులో పెడతామని కేంద్రప్రభుత్వం చెబుతోందని అన్నారు. అలా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే తాము ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని అన్నారు.
ఛలో ఢిల్లీ కార్యక్రమానికి టీడీపీ అధినేతను, ముఖ్యమంత్రిని, వైఎస్సార్సీపీ అధినేతను ఆహ్వానిస్తామని అన్నారు. నిరసనలో పాల్గొనేందుకు వారు ముగ్గురూ వస్తే దేశవ్యాప్తంగా సమస్య పట్ల అవగాహన ఏర్పడుతుందని అశోక్ బాబు అభిప్రాయపడ్డారు. తమకు ఉన్న సమాచారం మేరకు ఫిబ్రవరి 8, 9, 10 తేదీల్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆయన అన్నారు. దానిని అడ్డుకునేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రెండు రోజుల్లో ప్రకటిస్తామని ఆయన అన్నారు.