: బాపట్లలో ఆరు కోట్ల రూపాయలతో క్రీడా భవన సముదాయం
వ్యవసాయంలో అన్నదాతలు అధిక ఉత్పత్తులు సాధించడానికి వ్యవసాయ పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడుతాయని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో రూ. 6.06 కోట్లతో నిర్మించతలపెట్టిన క్రీడా భవన సముదాయానికి పనబాక ఈ రోజు (సోమవారం) శంకుస్థాపన చేశారు. వ్యవసాయ కళాశాలలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం ఇదే తొలిసారని మంత్రి చెప్పారు. ఇది దేశంలోనే మొట్టమొదటి రిఫాబ్రికేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని కేంద్ర ప్రభుత్వ యువజన శాఖ సర్వీసుల సంయుక్త కార్యదర్శి సి.జి.ఎస్ అయ్యంగార్ అన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజల ప్రతిభను మెరుగుపరచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడత రూ. 6 కోట్లు, రెండో విడత రూ. 5 కోట్లు, మూడో విడత 4 కోట్లను విడుదల చేయడం జరుగుతుందని అయ్యంగార్ తెలిపారు.