: చైనా విద్యార్ధులపై గాంధీజీ ముద్ర


జాతిపిత మహాత్మాగాంధీ అహింసాతత్వాన్నీ, ఆయన బోధనల్నీ మనం మరచిపోతున్నా...  మన పొరుగు దేశం చైనా మాత్రం ఆ మహనీయునికి పెద్ద పీట వేస్తోంది. ఒకప్పుడు చైనా మేధావి వర్గానికి మాత్రమే తెలిసిన గాంధీజీ, నేడు చైనీయులందరికీ చిన్నప్పటి నుంచే తెలుస్తున్నాడు. చైనాలో ప్రాధమిక స్థాయి పాఠశాలల నుంచే అక్కడి విద్యార్ధులకు గాందీజీపై ఏదో ఒక రూపంలో పాఠాలు ఉంటున్నాయట.

ఇక విశ్వవిద్యాలయాలలో అయితే చెప్పేక్కర్లేదు. గాంధీయిజంపై ఎంతోమంది వివిధ రకాల పరిశోధనలు చేస్తున్నారట. చైనా పండితుడు క్వాన్యు షాంగ్ ఈ విషయాన్ని చెబుతున్నారు. చైనా దక్షిణ చింగ్ నార్మల్ విశ్వ విద్యాలయానికి చెందిన స్కూల్ ఆఫ్ ఫారిన్ స్టడీస్ విభాగంలో ఆయన ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. భారత మాజీ దౌత్యాధికారి నజరత్ రాసిన  'గాంధీజీ అవుట్ స్టాండింగ్ లీడర్ షిప్' అనే పుస్తకాన్ని క్వాన్యు షాంగ్ చైనా భాషలోకి అనువదించాడు.

ఈ పుస్తకావిష్కరణ ఆదివారం ఢిల్లీ లో జరిగింది. ఆ కార్యక్రమంలో క్వాన్యు ఈ విషయాలను ముచ్చటించాడు. గాందీజీపై ఎన్నో గ్రంధాలు నేడు చైనా భాషలో లభ్యమవుతున్నాయని ఆయన చెప్పారు. గాంధీ పట్ల తమ ప్రజలలో ఆరాధనా భావం ఉందన్నారు.                    

  • Loading...

More Telugu News