: మరెంతో చేయడానికి 'పద్మ' ప్రోత్సాహాన్నిస్తుంది: కమల్ హాసన్
నటనే ప్రాణంగా విలక్షణ పాత్రలకు న్యాయం చేకూర్చి.. దేశంలో మూడో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన నటుడు కమల్ హాసన్(59) తన స్పందనను తెలియజేశారు. అవార్డు లభించడం తన అదృష్టంగా చెప్పారు. ఈ అవార్డు తాను చేసిన పనికి లభించిన గౌరవంగా భావించనని.. మరెంతో చేయాలంటూ ఇచ్చిన ప్రోత్సాహకంగా చూస్తానన్నారు. అప్పుడే తాను దీనికి అర్హుడిగా భావిస్తానన్నారు. ఇందుకు వీలుగా తాను మరింత కాలం జీవించగలనని ఆశాభావం వ్యక్తం చేశారు. కమల్ హాసన్ కు 1990లోనే పద్మశ్రీ అవార్డు లభించింది. మూడు జాతీయ అవార్డులు, 19 ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు కూడా ఆయనను వరించాయి. పలు భాషల్లో కమల్ హాసన్ 200కుపైగా చిత్రాల్లో నటించారు.