: కాంగ్రెస్ తీరు సరికాదు... రాష్ట్రపతి కూడా ఇదే చెప్పారు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న విధానం సరిగా లేదని, గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో రాష్ట్రపతి కూడా అదే విషయాన్ని ప్రస్తావించారనీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో గణతంత్రవేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, టీడీపీకి ప్రజలే పత్రికలు, రేడియో, టీవీలని అన్నారు. ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా తెగిస్తుందని ఆయన మండిపడ్డారు.
తనది ఉడుం పట్టని, అవినీతిపై రాజీలేని పోరాటం ఉంటుందని బాబు స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు సరఫరా చేస్తామని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామం వంటివని అభిప్రాయపడిన టీడీపీ అధినేత, క్విట్ ఇండియా పేరిట కాంగ్రెస్ పార్టీని తరిమి కొడదామని పిలుపునిచ్చారు. అవినీతి రహిత భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.