: వివిధ పార్టీల కార్యాలయాల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
65వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ పార్టీల కార్యాలయాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీభవన్లో నిర్వహించిన వేడుకల్లో పీసీసీ అధ్యక్షుడు బొత్స, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, సీఎం రమేష్, టీడీపీ నగర శాఖ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస యాదవ్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇక బర్కత్ పురా లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
తెలంగాణ భవన్ లో జరిగిన గణతంత్ర వేడుకలో టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డి, కె. కేశవరావు, మాజీమంత్రి వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయిని నరసింహారెడ్డి, రాష్ట్ర పునర్విభజన బిల్లును వెనక్కి పంపాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నోటీసును తిరస్కరించాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు విజ్ఞప్తి చేశారు.