: కొత్త ఓటర్ల నమోదులో.. ముందున్న రంగారెడ్డి జిల్లా


రాష్ట్రంలో కొత్తగా 76 లక్షల మందికి పైగా యువకులు కొత్తగా ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకున్నారు. హైదరాబాదు నగరంలో సుమారు ఐదు లక్షల మంది వరకు జాబితాలో పేర్లు నమోదు చేసుకుంటే.. రాష్ట్రంలోనే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో మొత్తం 12 లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు పొందారు.

ఏ వ్యక్తి అయినా ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని, పోటీ చేసిన వారిలో తమకు ఇష్టమైన వ్యక్తిని ఓటర్లు తమ ప్రతినిధిగా ఎన్నుకుంటారని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్ గుప్తా పేర్కొన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ జ్యోతిసేన్ గుప్తా మాట్లాడారు. ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు తొందరపాటు తగదని ఆయన యువ ఓటర్లకు సూచించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఓటరుగా నమోదు చేసుకున్న విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఓటరు గుర్తింపు కార్డు పొందిన వారంతా.. తమ పేర్లు ఓటర్లు జాబితాలో ఉన్నాయో, లేదా అని సరిచూసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్, జీహెచ్ఎంసీ ప్రత్యేక కమిషనర్ నవీన్ మిట్టల్, కమిషనర్ సోమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News